ఈ మార్నింగ్‌ రొటీన్‌తో నెగెటివ్‌ ఆలోచనలకు చెక్‌ పెడుతున్న సమంత!

  • రోజూ ఉదయం 5:30 నిద్ర లేస్తానన్న సమంత
  • లేవగానే కృతజ్ఞతా డైరీ రాస్తానన్న స్టార్‌ హీరోయిన్‌
  • తర్వాత ఎండలో ఐదు నిమిషాలు
  • అనంతరం అరగంట ధ్యానం
  • ఈ రొటీన్‌తో ఆత్మన్యూనత, భయాలు పోగొట్టుకోవచ్చని హితవు
స్టార్‌ హీరోయిన్‌ సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఎన్నో ఒడుదొడుకులను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. అయితే తనలో కలిగే ఆత్మన్యూనత భావం, నెగెటివ్‌ ఆలోచనలను ఎలా అధిగమిస్తుందో తాజాగా అభిమానులతో పంచుకున్నారు.

గతంలో తన డైలీ మార్నింగ్‌ రొటీన్‌పై ఓ వీడియోను పంచుకున్నానని గుర్తు చేసిన సమంత.. అది కేవలం వీడియో కోసం చెప్పింది కాదన్నారు. ఉదయం ఎండలో కొంతసేపు గడపడం, కృతజ్ఞతా డైరీ రాయడం, ధ్యానం చేయడం, దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం వంటి అలవాట్లు తన మనసులోని గందరగోళాన్ని తగ్గించాయని తెలిపింది. ఇవి నెగెటివ్‌ ఆలోచనలను దూరం చేయడంలో ఎంతో సాయపడ్డాయని పేర్కొంది.

“ప్రతి ఒక్కరికీ భయాలు ఉంటాయి. ఆత్మన్యూనత కూడా ఉంటుంది. కానీ ఒక క్రమబద్ధమైన రొటీన్‌ను పాటిస్తే వాటిలో చాలా వరకు సహజంగానే తగ్గిపోతాయి. నేను నా అనుభవంతో చెబుతున్నాను” అని సమంత పేర్కొంది.

అంతకుముందు 2024లో షేర్‌ చేసిన మరో వీడియోలో తన పూర్తి మార్నింగ్‌ రొటీన్‌ను కూడా వెల్లడించింది. రోజూ ఉదయం 5.30 గంటలకు లేస్తానని, వెంటనే కృతజ్ఞతా డైరీ రాస్తానని తెలిపింది. ఆ తర్వాత ఐదు నిమిషాలు ఎండలో గడపడం, శ్వాస వ్యాయామాలు చేయడం, సుమారు 25 నిమిషాలు ధ్యానం చేయడం తన దినచర్యలో భాగమని చెప్పింది.

ఇటీవల ‘ట్యాపింగ్‌’ అనే పద్ధతిని కూడా అలవాటు చేసుకున్నానని సమంత వెల్లడించింది. ఇది శరీరంలోని ఎనర్జీ బ్యాలెన్స్‌ను కాపాడటంతో పాటు నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ అలవాట్లన్నింటినీ ఒకేసారి మొదలుపెట్టాల్సిన అవసరం లేదని, ఒక్కటి లేదా రెండింటితో ప్రారంభించినా మంచి మార్పు కనిపిస్తుందని అభిమానులకు సూచించింది.

సమంత తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రేపు (జూన్ 19) ప్రేక్షకుల ముందుకు రానుంది.

Samantha Ruth Prabhu
Samantha morning routine
Samantha mental health tips
Maa Inti Bangaram movie
Samantha meditation and gratitude
Samantha tapping technique

More Telugu News